T20 World Cup Final: పాక్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌కు వానగండం..?
T20 ప్రపంచకప్ నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
- Author : Gopichand
Date : 12-11-2022 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
T20 ప్రపంచకప్ నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. కొంతమంది క్రీడా పండితులు 1992 వన్డే వరల్డ్‌కప్ సీన్ రిపీట్ కానుందంటూ జోస్యం చెబుతున్నారు. ఈ T20 వరల్డ్‌కప్‌లో మాదిరిగానే 1992 వన్డే వరల్డ్‌కప్‌లోనూ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. ఇక ఫైనల్ లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఇమ్రాన్ నాయకత్వంలోని పాక్ జట్టు విజేతగా నిలిచిన విషయాన్ని క్రీడా పండితులు గుర్తుచేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుణుడు ఫైనల్ మ్యాచ్‌కు కూడా అడ్డుతగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరగనున్న మెల్‌బోర్న్ లో ఆదివారం వర్షం పడే అవకాశాలు 100 శాతం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే రిజర్వు డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే.. సోమవారం కూడా 95 శాతం వరకు వర్షాలు పడే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కూడా వర్షం పడి మ్యాచ్ జరగకపోతే పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే గ్రూప్ దశలో కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదే నాకౌట్ దశలో అయితే, కనీసం 10 ఓవర్లు ఆడాలి. ఈ నేపథ్యంలో సోమవారం రిజర్వు డే ఉన్నప్పటికీ వర్షం పడితే కనుక ఓవర్లను కుదించి ఆ రోజే టోర్నీని ముగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమై మధ్యలో వర్షం కారణంగా ఆగిపోతే, ఆ తర్వాతి రోజైన సోమవారం ఆట ఆగిన దగ్గరి నుంచి మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. మెల్‌బోర్న్‌లో వర్షం కారణంగా మూడు సూపర్-12 మ్యాచ్‌లు రద్దయ్యాయి. వాటిలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇంగ్లండ్-ఐర్లాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించినా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విజయం సాధించింది.