Rishabh Pant: సెంచరీతో జట్టును ఆదుకున్న రిషబ్ పంత్
అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ నిరాశపరిచిన వేళ ఐదో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆపద్భాందవుడయ్యాడు.
- Author : Naresh Kumar
Date : 01-07-2022 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ నిరాశపరిచిన వేళ ఐదో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆపద్భాందవుడయ్యాడు. గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న పంత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. అది కూడా సిరీస్ విజయం ఊరిస్తున్న ఐదో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడిన ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తూ దూకుడైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో అలరించాడు.
ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచాడు. టెస్టు మ్యాచ్‌ను వన్డే మాదిరిగా ఆడుతూ బౌండరీల వర్షాన్ని కురిపించాడు. ఈ క్రమంలోనే 51 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు సహా ఓ సిక్సర్ ఉంది. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచిన ఈ యువ వికెట్ కీపర్ 89 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసియా ఖండం అవతల టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్ గా రికార్డులెకెక్కాడు.
గతంలో సెహ్వగ్ 78 బంతుల్లోనే సెంచరీ చేయగా.. అజారుద్దీన్ 88 బాల్స్ లో శతకం సాధించాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్ లో రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత వికెట్ కీపర్ గానూ పంత్ ఘనత సాధించాడు. సెంచరీ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లకు పంత్ చుక్కలు చూపించాడు. వరుస బౌండరీలతో స్కోర్ వేగం పెంచాడు. చివరికి 146 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర పంత్ ఔటయ్యాడు. పంత్ ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. జడేజాతో కలిసి పంత్ ఆరో వికెట్ కు 222 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై ఆరో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన సచిన్-అజారుద్దీన్ రికార్డును పంత్-జడేజా జోడీ సమం చేసింది. నిలకడగా రాణించలేకపోతున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కీలక సమయంలో సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
A fine fine innings from Rishabh Pant comes to an end.
He departs after scoring 146 runs.
Live – https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/cojpQHJqJm
— BCCI (@BCCI) July 1, 2022