IPL 2023 Points table: పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే ?
ఐపీఎల్ 16వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు జరుగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి
- By Naresh Kumar Published Date - 06:32 AM, Mon - 1 May 23

IPL 2023 Points table: ఐపీఎల్ 16వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు జరుగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. మ్యాచ్‌ల ఫలితాలకు తగ్గట్టే పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ప్రతీ జట్టూ 8 మ్యాచ్‌లు ఆడేశాయి. 4 జట్లయితే 9 మ్యాచ్ కూడా ఆడాయి. 16వ సీజన్‌లో 42 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లక్నో 5 విజయాలు, 3 ఓటములతో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ కూడా 10 పాయింట్ల చొప్పున వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నాయి. పాయింట్లు ఈ మూడు జట్లకూ సమానంగానే ఉన్నా.. రన్‌రేట్‌లో తేడా ఉండడంతో వాటి స్థానాలు మారాయి. ఇక టైటిల్ ఫేవరెట్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 విజయాలు, 4 ఓటములతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ కూడా 8 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడేసి విజయాలు సాధించి ఆరుపాయింట్లతో 8,9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలే సాధించిన ఢిల్లీ 4 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
మరోవైపు అత్యధిక పరుగుల జాబితా ఆరెంజ్ క్యాప్ రేసు కూడా రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో స్థానాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఉన్నాడు. నిజానికి జైశ్వాల్ టాప్ టెన్‌లో ఉన్నప్పటకీ.. ముంబై ఇండియన్స్‌పై సెంచరీతో ఒక్కసారిగా అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో జైశ్వాల్ 9 మ్యాచ్‌లు ఆడి 47.56 సగటుతో 428 పరుగులు చేశాడు. రెండో స్థానంలో డుప్లెసిస్, మూడో స్థానంలో కాన్వే కొనసాగుతున్నారు. డుప్లెసిస్ 8 మ్యాచ్‌లలో 422 , కాన్వే 9 మ్యాచ్‌లలో 414 పరుగులు చేశాడు. ఇక చెన్నై జట్టుకే చెందిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 9 మ్యాచ్‌లలో 354 రన్స్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 333 పరుగుల చేశాడు.
ఇదిలా ఉంటే పర్పుల్ క్యాప్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుశార్ దేశ్‌పాండే దూసుకెళుతున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్‌సింగ్ 15 వికెట్లతో రెండో స్థానంలోనూ, బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 వికెట్లతో మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు.గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 8 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. ఐదో స్థానంలో రవిచంద్రన్ శ్విన్ 13 వికెట్లు తీసుకున్నాడు.
Read More: MI vs RR: వాంఖేడేలో మురిసిన ముంబై.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై గెలుపు