On This Day: మరపురాని విజయానికి 15 ఏళ్లు
మొదటి టీ ట్వంటీ ప్రపంచకప్... క్రికెట్ అభిమానులే కాదు భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
- Author : Naresh Kumar
Date : 24-09-2022 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
మొదటి టీ ట్వంటీ ప్రపంచకప్… క్రికెట్ అభిమానులే కాదు భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా టైటిల్ సొంతం చేసుకుని పొట్టి క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయానికి నేటితో 15 ఏళ్ళు పూర్తయ్యాయి. దీంతో మరోసారి ఆ మధుర క్షణాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2007 వన్డే వరల్డ్ కప్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న భారత జట్టుపై ఏమాత్రం అంచనాలు లేవు. సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి దిగ్గజాలు లేకుండా పూర్తి యువ జట్టుతో ధోనీ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దుమ్మురేపింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించి గ్రాండ్ గా టైటిల్ వేట ఆరంభించింది.మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ త్వరగానే గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రాబిన్ ఊతప్ప ఆదుకోగా… ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కూడా అదే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. అప్పటి నిబంధనల ప్రకారం బౌల్ ఔట్ ద్వారా విజేతను నిర్ణయించారు. బౌలౌట్ లో ధోనీ తెలివిగా స్లో బౌలర్లతో వికెట్లు తీస్తే పాక్ బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఇదే టోర్నీలో యువరాజ్ సింగ్ సిక్సర్ల వర్షాన్ని ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో తనను రెచ్చగొట్టిన ఆండ్రూ ఫ్లింటాఫ్ ను యువీ ఉతికారేశాడు. బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు బంతులకూ ఆరు సిక్సర్లూ బాదాడు.
This day, in 2⃣0⃣0⃣7⃣#TeamIndia were crowned World T20 Champions 😎🇮🇳 pic.twitter.com/o7gUrTF8XN
— BCCI (@BCCI) September 24, 2019
స్టేడియం నలు వైపులా సిక్సర్ల వర్షం కురిపించిన యువీ గుర్తుండి పోయే ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ 12 బంతుల్లో అర్దశతకం పూర్తి చేసుకుని టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక తుది పోరులో దాయాది జట్టుతో ఫైనల్ ఆడిన భారత్ అద్భుతమే చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనంలో పాకిస్థాన్ తడబడింది. అయితే పాక్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగు బంతుల్లో 6 పరుగులుగా చేయాల్సి ఉండగా.. స్కూప్ షాట్‌గా ఆడిన మిస్బా గాల్లోకి లేపాడు. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న శ్రీశాంత్ ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఫలితంగా టీమిండియా ఆవరణంలో సంబరాలు మొదలయ్యాయి. స్టేడియంలో భారత అభిమానుల కేరింతలు, గోలలు నడుమ మొదటి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.