Mohammad Nabi: ఆప్ఘనిస్థాన్ కెప్టెన్సీకి నబీ గుడ్ బై..!
ఆప్ఘనిస్థాన్ సారథి మహ్మద్ నబీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
- By Gopichand Published Date - 11:56 PM, Fri - 4 November 22

ఆప్ఘనిస్థాన్ సారథి మహ్మద్ నబీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ ప్రపంచకప్ లో తమ జట్టుకు వచ్చిన ఫలితాలు తన మద్ధతుదారులకు నచ్చలేదని, ఓటమికి నైతిక బాధ్యతగా తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే తన రాజీనామా సందర్భంగా నబీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సంవత్సరం నుంచి తన జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన స్థాయిలో లేదన్నాడు. గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ, తాను ఒకే పేజీలో లేమన్న నబీ ఇది జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నాడు. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించినట్టు చెప్పుకొచ్చాడు.
కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి ఒక ఆటగాడిగా మాత్రం కంటిన్యూ అవుతాననీ, ఇన్నాళ్లు కెప్టెన్‌గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు నబీ. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దయినా తమపై అభిమానంతో మైదానాలకు వచ్చిన వారికి నబీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. .నబీ కెప్టెన్సీలోనే ఆఫ్గన్ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. 2017లో టెస్టు హోదా కూడా పొందింది. ఓవరాల్ గా మహ్మద్ నబీ అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా 28 వన్డేలు, 35 టి20ల్లో సారథ్యం వహించాడు.