Cricket Update: చెలరేగిన సిరాజ్,కుల్‌దీప్.. ఫాలోఆన్ ముంగిట బంగ్లా
- By Balu J Published Date - 05:48 PM, Thu - 15 December 22

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోర్ చేసిన టీమిండియా బౌలింగ్‌లో రాణించి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండోరోజు ఆరంభంలోనే శ్రేయాస్ అయ్యర్ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయ్యర్ 86 రన్స్ కు వెనుదిరిగాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, కుల్ దీప్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరిద్దరూ బంగ్లా బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు.
గత కొంత కాలంగా టెస్టుల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్న అశ్విన్ మరోసారి లోయర్ ఆర్డర్ లో తాను ఎంత కీలకమో నిరూపించుకున్నాడు. కుల్ దీప్ యాదవ్ తో కలిసి 8వ వికెట్ కు 92 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అశ్విన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అశ్విన్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 రన్స్ కు ఔటవగా… కుల్ దీప్ యాదవ్ 40 పరుగులు చేశాడు. చివర్లో ఉమేశ్ యాదవ్ వేగంగా ఆడడంతో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్ లో పుజారా 90 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4, మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ శాంటోను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపడంతో స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే వికెట్ చేజార్చుకుంది.
ఇక్కడ నుంచీ బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌తో పాటు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ చూపించడంతో బంగ్లా కోలుకోలేకపోయింది. లిట్టన్ దాస్ 24 , ముష్పికర్ రహీమ్ 28 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు అవకాశమివ్వలేదు. దీంతో బంగ్లా 102 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. తర్వాత మెహదీ హసన్ మిరాజ్, హొస్సేన్ కాసేపు క్రీజులో నిలవడంతో ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ప్రస్తుతం 271 పరుగులు వెనుకబడి ఉన్న ఆతిథ్య జట్టును తొలి సెషన్‌లో భారత్ ఆలౌట్ చేసి ఫాలోఆన్ ఆడించే అవకాశం కనిపిస్తోంది.