Wrestlers – Kapil Dev : రంగంలోకి 1983 టీమిండియా.. రెజ్లర్లకు ధైర్యం చెప్పిన కపిల్ సేన
Wrestlers - Kapil Dev : రెజ్లర్ల నిరసనలపై కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలిచిన టీమ్ ఇండియా సభ్యులు స్పందించారు. దేశం తరఫున పోటీపడి .. కష్టపడి సంపాదించిన పతకాలను గంగానదిలో వేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచించారు.
- By Pasha Published Date - 05:17 PM, Fri - 2 June 23

Wrestlers – Kapil Dev : రెజ్లర్ల నిరసనలపై కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలిచిన టీమ్ ఇండియా సభ్యులు స్పందించారు. దేశం తరఫున పోటీపడి .. కష్టపడి సంపాదించిన పతకాలను గంగానదిలో వేయడం లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచించారు. ఈమేరకు 1983 ప్రపంచకప్ ఇండియా టీమ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. “మా ఛాంపియన్ రెజ్లర్లపై బల ప్రయోగం జరుగుతున్న దృశ్యాలను చూసి మేం చాలా బాధపడ్డాం. ఆందోళనకు గురయ్యాం. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నారని తెలిసి బాధ కలిగింది” అని పేర్కొన్నారు. “ఆ పతకాలు మీ కృషి, త్యాగం, సంకల్పాలకు చిహ్నాలు. అవి మీకు మాత్రమే సొంతం కాదు.. యావత్ దేశానికి గర్వం, సంతోషం పంచిన తీపి జ్ఞాపకాలు ఆ పతకాలు” అని వ్యాఖ్యానించారు. “మీ మనోవేదనలను త్వరగా విని పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం” అని కపిల్ సేన (Wrestlers – Kapil Dev) ఆశాభావం వ్యక్తం చేసింది.
Also read : Medals In Ganga : గంగలో మెడల్స్..నిమజ్జనానికి బయలుదేరిన రెజ్లర్లు
రెజ్లర్లకు న్యాయం జరగాలి.. కానీ న్యాయ ప్రక్రియతోనే.. : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారని, అయితే తగిన న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అది జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తారని వెల్లడించారు. దీనిపై త్వరితగతిన విచారణ జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. “అది మహిళా అథ్లెట్ అయినా .. సాధారణ మహిళ అయినా.. వారిపై ఏదైనా అఘాయిత్యం జరిగితే సత్వర న్యాయం జరగాలి” అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.