Sunrisers IPL 2022 : సన్ రైజర్స్ కు మరో షాక్
- By Naresh Kumar Published Date - 05:16 PM, Wed - 30 March 22

ఐపీఎల్ 2022 సీజన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశించిన 211 భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తాజాగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడటంతో.. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది.రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కోటాను వేయలేదు. అందుకే స్లో ఓవర్ రేట్ తప్పిదం కారణం కింద హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌క రూ.12 లక్షల ఫైన్ విధిస్తున్నాం అని బీసీసీఐ వెల్లడించింది… ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం ఒక జట్టు మొదటి సారి స్లో ఓవర్ రేటు తప్పిదం చేస్తే ఆ జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. ఆ జట్టు సారథికి రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని ఆటగాళ్లందరి నుంచి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది .. ఇక మూడోసారి కూడా అదే తప్పు చేస్తే జట్టు కెప్టెన్‌కు రూ. 30 లక్షల ఫైన్ తో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం కూడా విధిస్తారు. నిజానికి ఈ స్లో ఓవర్ రేట్ తప్పిదం సాధారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టు ఎక్కువగా పాల్పడుతూ ఉంటుంది. కానీ.. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేటాయించిన టైమ్ లోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌ని తక్కువగా వేసింది.