Bumrah Out of T20 Team: టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బూమ్రా ఔట్
అనుకున్నదే అయింది...బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాటల ఏదీ నిజం కాలేదు.
- By Naresh Kumar Published Date - 09:48 PM, Mon - 3 October 22

అనుకున్నదే అయింది…బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాటల ఏదీ నిజం కాలేదు. స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇటీవల ఆసియా కప్‌కు దూరం అయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20ల్లో బుమ్రా బౌలింగ్ చేసినప్పటికీ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సమయంలో వెన్ను నొప్పి వచ్చినట్లు చెప్పడంతో బీసీసీఐ మెడికల్ టీమ్ మళ్లీ పరీక్షలు నిర్వహించింది. దానికి సంబంధించి రిపోర్టులు రాగా…గాయం తీవ్రత దృష్ట్యా కొన్ని నెలల విశ్రాంతి సూచించారు. దీంతో అతను టీ ట్వంటీ వరల్డ్ కప్ కు దూరం కాక తప్పలేదు.
బూమ్రా స్థానంలో మరో ప్లేయర్ ను త్వరలోనే ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. డెత్ ఓవర్లలో టీం ఇండియా ఫోబియాను బూమ్రా తొలగిస్తాడని ఆశిస్తే ఇప్పుడు అతను దూరమవడం టీమిండియాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడంతో ఆసియా కప్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకొంది. మరోవైపు బూమ్రాకి రిప్లేస్ ఎవరు అనే చర్చ టీం ఇండియాను టెన్షన్ పెడుతోంది. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో ఉన్న మహమ్మద్ షమీ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.