IPL 2024 : ఒక బెర్త్..రెండు జట్లు నాకౌట్ పోరుకు చెన్నై,బెంగళూరు రెడీ
ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది
- By Sudheer Published Date - 10:05 AM, Fri - 17 May 24

ఐపీఎల్ (IPL 2024) 17వ సీజన్ ప్లే ఆఫ్ లెక్కలు తేలిపోయాయి. ఇప్పటికే మూడు జట్లు అధికారికంగా ప్లే ఆఫ్ బెర్తులు దక్కించుకున్నాయి. రాజస్థాన్, కోల్ కతా జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకోగా… వర్షంతో గుజరాత్ మ్యాచ్ రద్దవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా నేరుగా ప్లే ఆఫ్ కు దూసుకెళ్ళింది. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అయితే ఈ విషయంలో చెన్నై జట్టు కాస్త మెరుగైన స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరు కంటే రెండు పాయింట్లు ఎక్కువే ఉన్న చెన్నై మ్యాచ్ ఓడినా, తక్కువ మార్జిన్ తో ఓడినా కూడా ముందంజ వేస్తుంది. బెంగళూరు కంటే మెరుగైన రన్ రేట్ ఉండడమే దీనికి కారణం.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవాలంటే ఎంత తేడాతో గెలవాలన్నది కూడా బెంగళూరుకు క్లారిటీ ఉంది. మొదట బ్యాటింగ్ చేస్తే చెన్నైని 18 రన్స్ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో బ్యాటింగ్ వస్తే లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడే పాయింట్లు సమమైనా చెన్నై కంటే మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్ లో అడుుపెడుతుంది. అయితే మ్యాచ్ కు ముందు వరుణుడు ఆర్సీబీని టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే మ్యాచ్ జరిగే రోజు బెంగళూరులో వర్షం పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరుతుంది.
ఇదిలా ఉంటే ఫస్టాఫ్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెకండాఫ్ లో మాత్రం అదరగొడుతోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. మరి ఇదే జోరు చెన్నైతో మ్యాచ్ లోను కొనసాగించి ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు చెన్నై జట్టును కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ధోనీ సారథిగా లేకున్నా ఒత్తిడిలో ఎలా ఆడాలో చెన్నై ప్లేయర్స్ కు బాగా తెలుసు. అందుకే చాలా మంది ఈ నాకౌట్ మ్యాచ్ లో చెన్నై జట్టునే ఫేవరెట్ గా అంచనా వేస్తున్నారు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తే బెంగళూరు స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.
Read Also : NTR : ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ…న్యాయం కోసం కోర్ట్ కు .!!