KL Rahul: కె ఎల్ రాహుల్ పెద్ద మనసు
భారత స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాబు వరద్ బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన డబ్బును అందించాడు.
- By Hashtag U Published Date - 07:38 AM, Wed - 23 February 22

భారత స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల బాబు వరద్ బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన డబ్బును అందించాడు. ఇటీవల ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వరద్ గురించి తెలుసుకున్న కేఎల్ రాహుల్ వెంటనే వరద్ అమ్మానాన్నలను సంప్రదించి సర్జరీకి కావాల్సిన రూ.31 లక్షల నగదును అందించాడు.. ఇక కెఎల్ రాహుల్ సాయంతో వరద్ కు జరిగిన సర్జరీ విజయవంతమైంది.
ప్రస్తుతం ఆ చిన్నారి హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ కెఎల్ రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆస్పత్రిలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి వరద్ ఫొటోను బీసీసీఐ తాజాగా షేర్ చేసింది. అత్యంత అరుదైన బోన్ మ్యారో వ్యాధితో బాధపుడుతున్న చిన్నారి వరద్ ఆపరేషన్ విజయవంతమైందన్న విషయం ఆనందాన్ని ఇస్తుంది. అతడు పూర్తి ఆరోగ్యవంతుడిగా జీవించాలని ఆశిస్తున్నాం… చిన్నారి ఆపరేషన్ కు సాయం అందించిన కెఎల్ రాహుల్ కు ధన్యవాదాలు’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఇక ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించిన కేఎల్ రాహుల్ కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు హార్ట్ ఎమోజీలతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేఎల్ రాహుల్ టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌తో పాటు 2 టెస్టుల సిరీస్ కూడా ఆడడం లేదు.