Sikhar Dhawan: ఐపీఎల్ వల్లనే ఈ విజయం : ధావన్
కరేబియన్ టూర్ లో యంగ్ ఇండియా అదరగొడుతోంది. తొలి వన్డే తరహాలోనే ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్లతో గెలుపొందింది.
- By Naresh Kumar Published Date - 04:08 PM, Mon - 25 July 22

కరేబియన్ టూర్ లో యంగ్ ఇండియా అదరగొడుతోంది. తొలి వన్డే తరహాలోనే ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్లతో గెలుపొందింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ శిఖర్ ధావన్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. నిజంగా ఇది అద్భుత విజయమన్నాడు.. కుర్రాళ్లు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘమని కితాబిచ్చాడు. నిజానికి ఐపీఎల్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ధావన్ వ్యాఖ్యానించాడు. అలాంటి మోగా టోర్నీలో ఆడినందు వల్ల భయం, బెరుకు లేకుండా అన్ని చోట్లా కూడా ఆడగలుగుతున్నారని గబ్బర్ గుర్తు చేశాడు.
భారత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఇలాంటి విజయాలు సాధించగలుగుతోందన్నాడు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఐపీఎల్ నుంచే ఆటగాళ్లకు బాగా అలవాటు అయిందని, ఇది అంతర్జాతీయ క్రికెట్‌కు సహకరిస్తోందన్నాడు. ఇక శాంసన్ సిల్లీగా రనౌట్ అయినప్పటికీ ఆటలో ఇలాంటివి సహజమన్నడు. కుర్రాళ్లు ఇలాంటి తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటారనీ, సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
భారీ లక్ష్య చేధనలో భారత్ కు సరైన ఆరంభం లభించకున్నా శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.క్రీజులో సిరాజ్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్.. నాలుగో బంతికి భారీ సిక్సర్‌తో జట్టు జట్టును గెలిపించాడు.