T20 Semi Finals: కొంపముంచిన రనౌట్లు… సెమీస్ లో భారత్ ఓటమి
మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు.
- By Naresh Kumar Published Date - 09:45 PM, Thu - 23 February 23

T20 Semi Finals: మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. పేలవ ఫీల్డింగ్, కీలక సమయంలో రనౌట్లు భారత్ కొంపముంచాయి. దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. పవర్ ప్లేలో పర్వాలేదనిపించిన భారత బౌలర్లు తర్వాత నిరాశ పరిచారు. దీనికి భారత పేలవ ఫీల్డింగ్ కూడా ఆసీస్ కు కలిసొచ్చింది. ఓపెనర్లు అలీసా హేలీ 25, బెత్ మూనీ 54 రన్స్ తో రాణించారు. మూనీ ఇచ్చిన క్యాచ్ ను జారవిడవడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా ధాటిగా ఆడింది. ఆమెకు ఆష్లీ గార్డనర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా తోడవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా జట్టు చివరి పది ఓవర్లలో 103 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవరల్లోనే 61 పరుగులు వచ్చాయి. అంచనాలు పెట్టుకున్న స్టార్ బౌలర్ రేణుకా సింగ్ ఆసీస్ పై తేలిపోయింది. రేణుకా 4 ఓవర్లలో 41 రన్స్ ఇచ్చింది. రేణుక వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు,దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించే క్రమంలో పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షేఫాలీ వర్మ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 9 రన్స్ ఔటవగా…స్మృతి మందాన 2 పరుగులకు వెనుదిరిగింది. కాసేపటికే భాటియా కూడా రనౌట్ అవడంతో భారత్ 28 రన్స్ కు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జేమీ రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ నాలుగో వికెట్ కు 69 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. రోడ్రిగ్స్ కేవలం 24 బంతుల్లో 43 పరుగులు చేయగా…తర్వాత రిచా ఘోష్ సపోర్ట్ తో హర్మన్ ప్రీత్ కౌర్ అదరగొట్టింది. భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లను ప్రేక్షక పాత్రకే పరిమితం చేసింది. కేవలం 32 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే దురదృష్టవశాత్తూ 54 రన్స్ దగ్గర ఆమె రనౌట్ అవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అప్పటికి విజయం కోసం భారత్ 32 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాత రిచా ఘోష్ కూడా వెనుదిరగడం భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది. అయితే 18వ ఓవర్లో 11 రన్స్ రావడంతో విజయంపై ఆశలు నిలిచాయి. చివరి రెండు ఓవర్లలో ఆసీస్ పై చేయి సాధించడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.