T20 Series : జోరు తగ్గని యువభారత్..టీ20 సిరీస్ కైవసం
7th consecutive T20 series : మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే ఔటవగా... సూర్యకుమార్ కూడా నిరాశపరిచాడు
- By Sudheer Published Date - 10:42 PM, Wed - 9 October 24

బంగ్లాదేశ్ (Bangladesh) తో మూడు టీ ట్వంటీల సిరీస్ (T20 Series) ను భారత్ (INdia) కైవసం చేసుకుంది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాను 86 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ధనాధన్ బ్యాటింగే హైలెట్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే ఔటవగా… సూర్యకుమార్ కూడా నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా నితీశ్ కుమార్ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఈ సారి చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అది కూడా టీ ట్వంటీ ఫార్మాట్ కు తగ్గట్టుగానే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట 13 బంతుల్లో 13 పరుగులే చేసిన నితీశ్ తర్వాత 14 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన నితీష్ భారీ సిక్సర్లతు ఫ్యాన్స్ ను అలరించాడు. రింకూసింగ్ తో కలిసి 108 పరుగుల కీలక పార్టనర్ షిప్ ను నెలకొల్పాడు.
ఓవరాల్ గా నితీశ్ కుమార్ 34 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 74 పరుగులు చేయగా.. రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. రింకూ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 రన్స్ కు ఔటయ్యాడు. చివర్లో హార్థిక్ కూడా ధాటిగా ఆడి 19 బంతుల్లోనే 32 రన్స్ చేశాడు. చివర్లో భారీస్కోర్ సాధించే క్రమంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టీమిండియా 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది. దూకుడుగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో బంగ్లా కోలుకోలేకపోయింది. పెద్దగా పోటీ ఇవ్వకుండానే ఓటమిని ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 135 పరుగులే చేసింది. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా…అర్షదీప్, వాషింగ్టన్ సుందర్ , అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.