Ind Vs WI : సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డ్
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
- By Naresh Kumar Published Date - 12:55 PM, Thu - 10 February 22

టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ 64 పరుగులతో రాణించాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ర్యాన్ టెన్ డస్కటే, టామ్ కూపర్, పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 30కి పైగా పరుగులు చేశారు. తాజాగా సూర్యకుమార్ వీరిని వెనక్కినెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణిస్తున్నప్పటకీ… సూర్యకుమార్ ను జాతీయ జట్టులోకి ఆలస్యంగా ఎంపిక చేశారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వనియోగం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు తొలి వన్డేలో ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్‌పై వేటు వేసి.. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటిచ్చాడు. దాంతో.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఆడతారని అంతా ఊహించారు.
కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరూ ఊహించని విధంగా రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా తీసుకొచ్చి భారీ షాకిచ్చాడు. పంత్ విఫలమవడంతో రోహిత్ ప్రయోగం బెడిసికొట్టినట్టయింది. అయితే 2023 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్నామని, ఈ క్రమంలోనే ప్రయోగాలు తప్పవని రోహిత్ స్పష్టం చేశాడు