INDW vs PAKW: పాక్ చేతిలో భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమి
INDW vs PAKW: మహిళల ఆసియా కప్ లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలు సాధించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది.
- Author : Anshu
Date : 07-10-2022 - 8:07 IST
Published By : Hashtagu Telugu Desk
INDW vs PAKW: మహిళల ఆసియా కప్ లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలు సాధించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయింది. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ను భారత బౌలర్లు దీప్తి శర్మ , పూజా వస్త్రాకర్ కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 32 , ఆల్‌రౌండర్ నిదా దర్ 56 పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి 3, పూజా 2, రేణుకకు ఒక వికెట్ పడగొట్టారు. టార్గెట్ చిన్నదే అయినా భారత మహిళల జట్టు తడబడింది.
ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 , జెమీమా 2, హేమలత 20 పరుగులకు ఔటయ్యారు. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 12, రిచా ఘోష్ 26 పరుగులు డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. దీంతో భారత జట్టు 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌట్ అయింది. 2016 తర్వాత భారత్ పై పాక్ మహిళలకు ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం.