Pak Cricketer Naseem Shah : పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు
Pak Cricketer Naseem Shah : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ప్రముఖ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు జరగడం సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు నసీమ్ షా నివాసంపై అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళన చెలరేగింది
- By Sudheer Published Date - 12:15 PM, Tue - 11 November 25
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ప్రముఖ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు జరగడం సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు నసీమ్ షా నివాసంపై అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళన చెలరేగింది. దుండగులు కాల్పులు జరిపిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండగా, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే కాల్పుల తీవ్రతతో ఇంటి మెయిన్ గేటు, కిటికీలు, మరియు ముందు పార్క్ చేసిన కారు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు గందరగోళానికి గురయ్యారు.
Gold Prices: మళ్లీ పెరిగిన ధరలు.. బంగారం కొనుగోలు చేయటానికి ఇదే సరైన సమయమా?
కాల్పుల విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఇది ముందుగా ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. నసీమ్ షా ఇంటి పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి, కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన తరువాత నసీమ్ షా ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తూ, అదనపు సిబ్బందిని మోహరించారు.
పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన క్రికెటర్‌పై దాడి జరగడం దేశ భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తిందని వారు పేర్కొన్నారు. ఇకపోతే, నసీమ్ షా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి గుర్తింపు పొందిన వేళ ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డును అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.