ENG vs USA : బట్లర్ ఊచకోతకు అమెరికా విలవిల.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ సాగుతున్న ఇంగ్లాండ్ సూపర్ 8 రౌండ్ లో మరోసారి అదరగొట్టింది.
- Author : Pasha
Date : 24-06-2024 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
ENG vs USA : టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ సాగుతున్న ఇంగ్లాండ్ సూపర్ 8 రౌండ్ లో మరోసారి అదరగొట్టింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించడంతో అమెరికాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన అమెరికా(ENG vs USA) 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ 30 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిజానికి అమెరికా ఇన్నింగ్స్ అనూహ్యంగా ముగిసింది. క్రిస్ జోర్డాన్ దెబ్బకు 115 రన్స్ దగ్గర అయిదు వికెట్లు కోల్పోయింది. జోర్డాన్ హ్యాట్రిక్‌తో సహా ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. 19వ ఓవర్ తొలి బంతికి కోరీ ఆండర్సన్‍ను జోర్డాన్ ఔట్ చేశాడు. రెండో బంతికి పరుగులు ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత అలీఖాన్, కెంజిగే, నేత్రవల్కర్‌ను వరుసగా మూడు, నాలుగు, ఐదు బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. జోర్డాన్ 10 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
We’re now on WhatsApp. Click to Join
తర్వాత చేజింగ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ అమెరికా బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి రెండు ఓవర్లకు ఇంగ్లండ్ 6 పరుగులే చేసింది. అయితే మూడో ఓవర్ నుంచి బట్లర్ రెచ్చిపోయాడు. ఆతిథ్య అమెరికా బౌలర్లకు చుక్కలు చూపించాడు.అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డ బట్లర్ కేవలం 38 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.
ఒక ఓవర్లో అయితే ఏకంగా అయిదు సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ అందుకుంది. బట్లర్ తో పాటు ఫిలిప్ సాల్ట్ 25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అటు లీగ్ స్టేజ్ లో ఆకట్టుకున్న అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా సూపర్ 8 గ్రూప్ 2 నుంచి మరో బెర్త్ కోసం వెస్టిండీస్ , సౌతాఫ్రికా రేసులో నిలిచాయి.