IPL 2023 RR vs SRH: దంచికొట్టిన బట్లర్, శాంసన్.. సన్ రైజర్స్ టార్గెట్ 204
ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 204 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఉంచింది.
- By Naresh Kumar Published Date - 05:59 PM, Sun - 2 April 23

IPL 2023 RR vs SRH : ఐపీఎల్ 16వ సీజన్ (IPL 2023) సండే డబుల్ ధమాకా మ్యాచ్ లలో మొదటిపోరు ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 204 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఉంచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్ లో జాస్ బట్లర్ , జైశ్వాల్, సంజూశాంసన్ ఆటే హైలెట్ గా చెప్పాలి. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో భారీ షాట్లతో సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎటాకింగ్ బ్యాటింగ్ తో రెచ్చిపోయిన బట్లర్ కేవలం 22 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అటు యశస్వి జైశ్వాల్ కూడా ధాటిదా ఆడాడు. 37 బంతుల్లో 9 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్ కు కేవలం 5.5 ఓవర్లలోనే 85 పరుగులు పార్టనర్ షిప్ జోడించారు. తర్వాత సంజూ శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న సంజూ ఈ సీజన్ ను హాఫ్ సెంచరీతో ఆరంభించాడు. కాన్ఫిడెంట్ గా కనిపించిన ఈ కేరళ యువ క్రికెటర్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఒక దశలో రాజస్థాన్ 220కి పైగా స్కోర్ చేస్తుందనుకున్నారు. అయితే చివర్లో పుంజుకున్న సన్ రైజర్స్ బౌలర్లు రాజస్థాన్ జోరుకు కళ్ళెం వేశారు. దీంతో రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఆఫ్ఘనిస్థాన్ పేసర్ ఫరూఖీ 2 , నటరాజన్ 2 , ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ (IPL 2023) అరంగేట్రం చేశాడు.
Also Read: Abdul Kalam Another Side: మీడియా చూపని అబ్దుల్ కలాం మరోకోణం..!