MCG Test: రెండో టెస్టులో సౌతాఫ్రికా చిత్తు
సొంతగడ్డపై తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. సౌతాఫ్రికాను రెండో టెస్టులోనూ చిత్తుగా ఓడించింది.
- By Naresh Kumar Published Date - 01:44 PM, Thu - 29 December 22

సొంతగడ్డపై తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. సౌతాఫ్రికాను రెండో టెస్టులోనూ చిత్తుగా ఓడించింది. తొలి టెస్టు తరహాలోనే ఈ మ్యాచ్ కూడా పూర్తి ఏకపక్షంగా సాగింది. సఫారీ బ్యాటర్లు ఏ దశలోనూ పోరాడని వేళ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. నాలుగోరోజు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. బవూమా 65 , వెర్నెనే 33 తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బౌలర్లలో నాథన్ ల్యాన్ 3 , బొలాండ్ 2 , స్టార్క్ , కమ్మిన్స్ , స్మిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనూ సఫారీ బ్యాటర్లు నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు కేవలం 189 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీ జట్టును కామెరూన్ గ్రీన్ హడలెత్తించాడు. 5 వికెట్లతో ఆ జట్టు ఇన్నింగ్స్ ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలింగ్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 575 పరుగుల భారీస్కోర్ సాధించింది. డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో అదరగొడితే..అలెక్స్ క్యారీ సెంచరీతో రాణించాడు. స్మిత్ , హెడ్ , గ్రీన్ హాఫ్ సెంచరీలతో మెరిసారు.
ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా దాదాపుగా చేరువైంది. మూడో టెస్ట్ సిడ్నీ వేదికగా జరగుతుంది.