Everest Girl: ఎవరెస్ట్ కు హలో చెప్పిన తెలంగాణ అమ్మాయి
సాహసం ఎవరి సొత్తూ కాదు...పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి క్లిష్టమైన లక్ష్యమైనా అందుకోవడం సాధ్యమే.
- By Naresh Kumar Published Date - 11:17 PM, Sat - 28 May 22

సాహసం ఎవరి సొత్తూ కాదు…పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి క్లిష్టమైన లక్ష్యమైనా అందుకోవడం సాధ్యమే. కాకుంటే దానిని తగ్గ ప్రోత్సాహం, శిక్షణ వంటివి తోడవ్వాలి. ఇవి పూర్తి స్థాయిలో లేకున్నా ఎంతో కష్టమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి…ఆమె పట్టుదల ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నబోయింది…ఆమె ఎవరో కాదు పడమటి అన్విత రెడ్డి. ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో అన్విత ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత రెడ్డి అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు పడమటి మధుసూదన్ రెడ్డి,చంద్రకళ. అన్విత భువనగిరిలోని రాక్ క్లైబింగ్ స్కూల్లో బేసిక్, ఇంటర్మిడియట్ , అడ్వాన్స్ ,ఇన్స్ట్రక్టర్ శిక్షణను పూర్తి చేసింది. పర్వతారోహణ కోర్సులను సైతం పూర్తి చేసింది. అయితే మిగిలిన శిఖరాలన్నీ ఒక ఎత్తు… ఎవరెస్టును అధిరోహించడం మరొక ఎత్తు. ఈ లక్ష్యం చేరాలంటే ఎంతో కఠిన పరిస్థితులను అధిగమించాల్సి ఉంటుంది. వాతావరణమే కాదు ఆరోగ్యం, అన్నింటినీ తట్టుకునే శరీరం ఇలా పలు అంశాల్లో పూర్తి స్థాయి సామర్థ్యం ఉంటేనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలుగుతారు.
గతంలో ప్రయత్నాలు చేసి సఫలమైనా వారూ ఉన్నారు.. విఫలమైన వారూ ఉన్నారు. అయితే అన్వితరెడ్డి మాత్రం అన్ని అంశాల్లోనూ చక్కని తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించింది. ఆమె ఎవరెస్ట్ ప్రయాణాన్ని ఒకసారి చూస్తే… హైదరాబాద్ నుంచి ఏప్రిల్ 2న ఆమె నేపాల్కు బయలుదేరి వెళ్లారు. నాలుగో తేదీన నేపాల్ కు చేరుకున్నారు. డాక్యుమెంట్లు పూర్తిచేసి ఖాట్మండులోని కొన్ని రోజులు గడిపిన అనంతరం లుక్లాకు వెళ్లారు. తొమ్మిది రోజులు కాలినడకన ఏప్రిల్ 17న 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్నారు. కొన్ని రోజులు పర్వతంపైకి రొటేషన్స్ పూర్తిచేశారు. తర్వాత ఎత్తైన శిఖరాలకు 7100 మీటర్లు ఎక్కి తర్వాత విశ్రాంతి తీసుకున్నారు.
అన్విత అనుభవజ్ఞులైన ఇద్దరు గైడ్స్ తో కలిసి బేస్ క్యాంపు వరకు పలుమార్లు వాతావరణాన్ని ఆక్సిజన్ హెచ్చు తగ్గులను పరిశీలించారు. మే 12న సాహస యాత్రను ప్రారంభించి వివిధ ఎత్తులతో నాలుగు పర్వతాలు దాటి ఈ నెల 16న సమ్మిట్ పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 8.848.86 కిలోమీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ను అన్విత రెడ్డి ఐదు రోజుల్లో అధిరోహించి అందరినీ ఆశ్చర్చపరిచింది. ఎవరెస్టును అధిరోహించాలన్న ఆమె సంకల్పానికి హైదరాబాద్ కు చెందిన ట్రాన్సెన్స్ అడ్వెంచర్స్ సంస్థ అధినేత శేఖర్ బాబు బాచినపల్లి ప్రోత్సాహంతో పాటు శిక్షణ కూడా అందించారు. గతంలో సిక్కింలోని రీనాక్, సిక్కింలోని మరో పర్వతం బీసీ రాయ్, కిలి మంజారో, లదాక్ లోని కడే, ఎల్బ్రుస్ పర్వతాలు అధిరోహించింది. శీతాకాలంలో అత్యంత ప్రమాదకరమైన వాతావరణం మధ్య ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన ఏకైక భారతీయురాలిగా ఆమె రికార్డులకెక్కింది.
తమ కుమార్తె సాధించిన విజయం ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకానోక సందర్భంలో తమ కుమార్తె సాహసంపై భయపడినప్పటకీ… కోచ్ శేఖర్ బాబు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే ఎంతటి సాహసాన్నైనా చేయొచ్చని నిరూపించిన అన్విత రెడ్డి ఎంతోమంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.