Sk Rasheed : గుంటూరు కుర్రాడా మజాకా..
ఐపీఎల్ మెగా వేలానికి ముందు అండర్ 19 ప్రపంచకప్ లో గుంటూరుకు చెందిన కుర్రాడు అదరగొట్టాడు, కెప్టెన్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ సాధించిన షేక్ రషీద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు
- By Naresh Kumar Published Date - 11:32 AM, Thu - 3 February 22

ఐపీఎల్ మెగా వేలానికి ముందు అండర్ 19 ప్రపంచకప్ లో గుంటూరుకు చెందిన కుర్రాడు అదరగొట్టాడు, కెప్టెన్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ సాధించిన షేక్ రషీద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నా… ఫ్రాంచైజీల దృష్టిలో మాత్రం పడ్డాడు. భారత అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన చాలా మంది షేక్ రషీద్ పై అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడీ కుర్రాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కెప్టెన్ యష్ ధూల్ తో కలిసి సెమీస్ లో రషీద్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు అతని కెరీర్ నే మలుపు తిప్పబోతోంది. గత కొంత కాలంగా అండర్ 19 జట్టు నుండి భారత జాతీయ జట్టుకు ఎంపిరైన వారిని చాలా మందినే చూశాం. కోహ్లీ, కైఫ్ , రైనా , యువరాజ్ వంటి స్టార్స్ అంతా ఈ స్థాయి నుండి వచ్చినవారే. అయితే ఐపీఎల్ వచ్చిన తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడకున్నా నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్న సందర్భాలు ఉండడం యువ ఆటగాళ్ళందరికీ అడ్వాంటేజ్. ప్రస్తుతం షేక్ రషీద్ ఆసీస్ పై సెమీస్ లో ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ వేలంలో అతనికి జాక్ పాట్ ఖాయమన్న అంచనాలు మొదలయ్యాయి. యువక్రికెటర్ కావడం, క్లిష్ట సందర్భాల్లో పరిణితి చెందిన ఆటగాడిగా రషీద్ ఆడిన తీరు ప్రశంసలు అందుకుంది. దీంతో ఫ్రాంచైజీలు ఈ ఆంధ్రా కుర్రాడి కోసం ఆసక్తి చూపిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి షేక్ రషీద్ తండ్రికి క్రికెట్ అంటే ఏంటో కూడా తెలీదు. కేవలం తన కొడుకుకు ఉన్న ఆసక్తితో కోచింగ్ ఇప్పించాడు. ఈ కోచింగ్ ఇప్పించే క్రమంలో రెండు సార్లు ఉద్యోగం కూడా వదులుకున్నాడు. అయితే తండ్రి పడిన కష్టానికి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు రషీద్. ఇప్పుడు జరగనున్న ఐపీఎల్ వేలంలో కనీస ధరకే బరిలోకి దిగినా ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న యువ ఆటగాడిని ఫ్రాంచైజీలు ప్రోత్సహిస్తాయని చెప్పొచ్చు. ఏదైతేనేం వేలం ముంగిట కీలక ఇన్నింగ్స్ ఆడిన గుంటూరు కుర్రాడు జాతీయ జట్టుకు ఆడాలన్న తన కలకు సరైన దారి ఏర్పరచుకున్నాడు. అండర్ 19 టీమ్ వెన్నంటే ఉన్న వెరీవెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్ చిట్కాలు కూడా రషీద్ బ్యాటింగ్ లో కీలకపాత్ర పోషించాయి. ఇదే జోరు ఫైనల్లోనూ చూపిస్తే భారత క్రికెట్ లో చాలారోజుల తర్వాత తెలుగురాష్ట్రాల ప్రాతినిథ్యం పెరిగినట్టే,