IPL 2022 : శ్రేయాస్ అయ్యర్ దేనా జాక్ పాట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నధ్ధమవుతున్నాయి. ఇప్పటికే వేదిక, తేదీలను కూడా ప్రకటించిన బీసీసీఐ తాజాగా వేలంలో పాల్గొనే 590 మంది తుది జాబితాను కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
- By Naresh Kumar Published Date - 01:33 PM, Wed - 2 February 22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నధ్ధమవుతున్నాయి. ఇప్పటికే వేదిక, తేదీలను కూడా ప్రకటించిన బీసీసీఐ తాజాగా వేలంలో పాల్గొనే 590 మంది తుది జాబితాను కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ వేలానికి సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. మర్కీ ప్లేయర్స్ జాబితాలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరనే దానిపై చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ జాక్ పాట్ కొడతాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు, ఖచ్చితంగా 15 కోట్ల పైనే అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు వెచ్చిస్తాయన్నాడు. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 20 కోట్లు అయ్యర్ కోసం పక్కన పెట్టుకుందని చోప్రా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తనకు బాగా సన్నిహితుడైన వ్యక్తి చెప్పారని తెలిపాడు.యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ మర్కీ ప్లేయర్స్ జాబితాలో లేకపోవడంతో అయ్యర్ కు అత్యధిక పలుకుతుందని ఈ మాజీ ఓపెనర్ విశ్లేషించాడు. గత కొన్ని సీజన్లుగా శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తుండడమే దీనికి కారణమన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. నిజానికి గాయంతో తప్పుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్ స్థానంలో పంత్ ను సారథిగా నియమించింది. శ్రేయాస్ తిరిగొచ్చిన తర్వాత కూడా పంత్ నే కొనసాగించడంతో అయ్యర్ అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. అందుకే ఈ సారి మరో జట్టుకు ఆడాలని అతను నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే కేవలం ఒక ప్లేయర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మంచి టీమ్ కాంబినేషన్ ను చూసుకుంటే ఫలితాలు అవే వస్తాయన్నాడు. కాగా ఫిభ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది.