YS Sharmila: వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారు
- Author : Balu J
Date : 19-01-2024 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో షర్మిలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీసీసీ చీఫ్‌గా నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజ్‌ను నియమించారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇకపై వైసీపీని టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు వార్తుల కూడా వచ్చాయి. ఇక కడప ఎంపీ స్థానం నుంచి కూడా షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏ ఎంపీ స్థానం కోసమైతే కుటుంబంలో విభేదాలు తలెత్తయో అదే ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేయటం నిజంగా సంచలనమే అవుతుంది.