G20 Summit : మోడీ తన గొప్పలు చెప్పుకోడానికి ప్రజల సొమ్మును ఖర్చుస్తారా..? – ప్రతిపక్షాలు ఫైర్
జీ20 సమావేశాలను ప్రధాని మోడీ తన సొంత ప్రచారానికి వాడుకున్నారని ఆరోపిస్తున్నాయి
- By Sudheer Published Date - 08:00 PM, Wed - 13 September 23

G20 (G20 summit 2023) సదస్సు ను ..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అట్టహాసంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ (Delhi) వేదికగా నాల్గు వేల కోట్లకు పైగా ఖర్చు తో ఈ సదస్సు ను నిర్వహించారు. ఈ నెల 09 ,10 తేదీలలో జరిగిన ఈ సదస్సు కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ సదస్సు కు మోడీ సర్కార్ పెట్టిన ఖర్చు ఫై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ముందుగా ఈ సదస్సుకు రూ.990 కోట్ల బడ్జెట్ గా తేల్చి..ఆ తర్వాత సమావేశాలు పూర్తయ్యేసరికి రూ.4100 కోట్లు పెట్టడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జీ20 సమావేశాలను ప్రధాని మోడీ తన సొంత ప్రచారానికి వాడుకున్నారని ఆరోపిస్తున్నాయి. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భారీగా ఖర్చు చేసి హంగులు, ఆర్భాటాలతో దేశ సొమ్మును వృథా చేశారని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : Gunda Jayaprakash Naidu : గత ఎన్నికల్లో డబ్బులు పంచిన జనసేన నేత.. ఇప్పుడు అరెస్ట్..
తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే దీనిపై స్పందిస్తూ.. సదస్సుకు రూ. 990 కోట్లు కాకుండా.. రూ. 4100 కోట్లు పెట్టడం దారుణమని గోఖలే మండిపడ్డారు. ఇదంతా ప్రధాని మోడీ ఇమేజ్ పెంచుకోవడానికే వాడుకున్నారని.. అందుకే రూ. 4100 కోట్లలో నుంచి ముందు కేటాయించిన రూ. 990 కోట్లు మినహాయించి.. రూ. 990 కోట్లు కాకుండా.. మిగిలిన రూ. 3110 కోట్లను బీజేపీ నుంచి వసూలు చేయాలని సాకేత్ గోఖలే డిమాండ్ చేశారు.