Insta Reel: ఇన్స్టాగ్రామ్ రీల్ రికార్డు చేస్తుండగా దూసుకొచ్చిన ట్రైన్.. యువకుడి మృతి
సోషల్ మీడియా పిచ్చి ప్రాణం తీసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీద్దామని రైలు పట్టాలపైకి యువకుడు ఎక్కాడు. రైలు పట్టాలపై నిల్చోని రీల్ చేస్తుండగా.. వెనుక నుంచి ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడకే మృతి చెందాడు.
- By Anshu Published Date - 10:15 PM, Fri - 5 May 23

Insta Reel: సోషల్ మీడియా పిచ్చి ప్రాణం తీసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీద్దామని రైలు పట్టాలపైకి యువకుడు ఎక్కాడు. రైలు పట్టాలపై నిల్చోని రీల్ చేస్తుండగా.. వెనుక నుంచి ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడకే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ఏరియాలో జరిగింది.
సనత్ నగర్‌లో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా ఓ విద్యార్థి రైలు ఢీకొని శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడిని రహ్మత్ నగర్ శ్రీరామ్ నగర్ చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. రహ్మత్ నగర్ లోని ఓ మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్ గా గుర్తించారు. రైల్వే ట్రాక్‌లపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అండ్ వీడియోలను రికార్డ్ చేస్తుండగా.. సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి గాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు.
మృతుడి ఫోన్ ను స్పాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. ముగ్గురు స్నేహితులు సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. అయితే మహ్మద్ సర్ఫరాజ్‌కు సోషల్ మీడియా ఖాతా కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. యువకుడి వయస్సు 18 ఏళ్లుగా గుర్తించారు. రెహమత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ మాదర్శాలలో సర్ఫరాజ్ చదవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి స్నేహితునితో కలిసి సనత్ నగర్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
రైల్వే ట్రాక్ పక్కన ట్రైన్ వస్తున్న సమయంలో రీల్స్ కోసం సర్పరాజ్ వెళ్లగా.. ట్రైన్ ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే సర్ఫరాజ్ మృతి చెందాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.