Southwest Monsoons: తెలుగు రాష్టాల్లో నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడంటే?
ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోండగా.. భానుడి ప్రతాపంతో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలం జూన్ చివరి వరకు ఉండనుంది. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభం కానుండగా... అయితే ఈ సారి వర్షాకాలం కాస్త ఆలస్యంగా కానుంది.
- By Anshu Published Date - 09:43 PM, Tue - 16 May 23

Southwest Monsoons: ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోండగా.. భానుడి ప్రతాపంతో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలం జూన్ చివరి వరకు ఉండనుంది. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభం కానుండగా… అయితే ఈ సారి వర్షాకాలం కాస్త ఆలస్యంగా కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ సారి కాస్త ఆలస్యం అయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ చెబుతోంది. జూన్ 4 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని, దేశవ్యాప్తంగా విస్తరించడానికి సమయం పడుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
మాములుగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈ సారి కాస్త ఆలస్యంగా జూన్ 4 నాటికి తాకనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అంటే.. నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశముంది. గత ఏడాది 29 నాటికే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకగా.. 2021లో జూన్ 3న, 2020వ సంవత్సరంలో జూన్ 1న తాకాయి. అయితే ఈ సారి నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతమే నమోదయ్య అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇక ఈ నెల 19వ తేదీ నుంచి తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలకుపైగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య,. తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మిగతా ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. కానీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని హైదరాబద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
అటు ఏపీ కూడా నిప్పుల కొలిమిగా మారింది. 45 డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా. .వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి.