Farmers Woes: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
- By Hashtag U Published Date - 09:30 AM, Fri - 14 January 22

వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం ఇటిక్యాలపల్లి వద్ద రైతులు ఎన్‌హెచ్-365ను దిగ్బంధించి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలోని మొక్కజొన్న, మిర్చి, వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి పరిహారం అందజేసేందుకు అధికారికంగా హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.గోపిలను రైతులు డిమాండ్ చేశారు. పంటనష్టాన్ని వెంటనే లెక్కించేందుకు బృందాన్ని నియమించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. ఈ నిరసనలో పంట నష్టంతో మనస్తాపానికి గురైన ఇటిక్యాలపల్లికి చెందిన రైతు జన్ను ఐలయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..
పోలీసులు అడ్డుకున్నారు. ఆర్‌డిఓ పవన్‌కుమార్, ఎసిపి తిరుమల్ రైతుల దగ్గరకు వచ్చి నిరసన విరమించాలని కోరగా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రైతులు తమ ప్రదర్శనను కొనసాగించడంతో ఎన్‌హెచ్-365పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జిల్లా కలెక్టర్ బి గోపి ఫోన్‌లో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు. కాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో బుధ-గురువారాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 10 వర్షపాతంతో రెండో స్థానంలో ఉంది.