Ambati: అల్లర్లు కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు : అంబటి
- By Balu J Published Date - 07:25 PM, Sun - 19 May 24

Ambati: సత్తెనపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయి. ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో పాటు రాయల సీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్నిచోట్ల పోలీసులు సైతం కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు కూడా కనిపించాయి’’ అని విమర్శించారు.
‘‘పలనాడు, అనంతపురం జిల్లాల్లో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు మందు ఎన్నికల కమిషన్ మార్చింది. ఇంకా పలుచోట్ల ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం వీళ్లను మార్చాల్సి వచ్చిందంటే.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌కు ఒక ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులున్నారో.. వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా, తొత్తులుగా ఉన్నారంటూ.. కాబట్టి, వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాత ఎన్నికలు జరగవని ఆమె ఫిర్యాదులో ఎన్నికల కమిషన్‌ను కోరారు. సహజంగానే ఈ ఎన్నికల కమిషన్ కూడా ఆమె ఫిర్యాదును నమ్మి పలుచోట్ల ఐపీఎస్‌లను అప్పటికప్పుడు మార్చారు’’ అని అంబటి మండిపడ్డారు.
‘‘ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, ఎక్కడైతే అధికారులను మార్చాలని పురందేశ్వరి అడిగారో.. అక్కడ మార్చారో.. సరిగ్గా అక్కడ్నే హింస ప్రజ్వరిల్లింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.ఉదాహరణకు పలనాడు జిల్లాను తీసుకుంటే.. నేను ఇప్పటికి మూడోసారి కంటెస్ట్ చేశాను. గతంలో రెండుమార్లు ఎన్నికలు చేశాము. ఏరోజూ కూడా ఈసారి జరిగినంత పెద్ద ఎత్తున హింస జరగలేదు. నిన్నటి ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది’’ అంటూ మండి తీవ్ర ఆరోపణలు చేశారు.