Uttar Pradesh: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. కానీ అంతలోనే ఊహించని షాక్?
మామూలుగా ఒకే కళ్యాణమండపంలో రెండు పెళ్లిళ్లు జరగడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇలా
- By Anshu Published Date - 05:50 PM, Wed - 28 June 23

మామూలుగా ఒకే కళ్యాణమండపంలో రెండు పెళ్లిళ్లు జరగడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇలా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఒక పెళ్లి చూడడానికి కన్నుల పండుగగా ఉంటే ఇక రెండు పెళ్లిళ్లు అంటే ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతాయని చెప్పవచ్చు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒకే కళ్యాణమండపంలో రెండు పెళ్లిళ్లు జరుగుతున్నాయని అందరూ సంతోషపడుతుండగా ఇంతలోనే షాక్ ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఫిరోజాబాద్ లోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. జస్రానా గ్రామానికి చెందిన రాధేశ్యామ్ రాజ్‌పూత్ ఒకే ముహూర్తానికి తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేయాలని అనుకున్నారు. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపువారు సోమవారం రాత్రి కల్యాణ మండపానికి చేరుకున్నారు. అయితే వధువులు ఇద్దరూ తమతమ వరులకు పూల దండలు వేసి ఆహ్వానించారు. తరువాత రాయపూర్ నుంచి వచ్చిన మగ పెళ్లివారికి, వధువు తరపు వారికి డాన్స్ చేయడం విషయంలో వివాదం చోటుచేసుకుంది. అది కాస్త ఇరుపక్షాల వారు పరస్పరం కొట్టుకునేంతవరకూ దారితీసింది.
దీంతో ఒక వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది. వరుని తరపువారు తమవారిపై చేయిచేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. జస్రానా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకుని, ఇరుపక్షాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వధువు తరపువారికి ఎంత నచ్చజెప్పినా వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రాయ్‌పూర్ నుంచి వచ్చిన వరుడు పెళ్లి కాకుండానే తన కుటుంబ సభ్యులు, బంధువులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసిన తరువాత రాధేశ్యామ్ రాజ్‌పూత్ తన మరో కుమార్తెకు వివాహం జరిపించాడు. అలా సంతోషంతో రెండు పెళ్లిళ్లు జరగాల్సిన మండపంలో గొడవలు, కొట్లాటలతో ఒక పెళ్లి మాత్రమే జరిగింది.