Unique Thieves: “ఐ లవ్ యూ” చెప్పిన దొంగలు.. 20 లక్షల విలువైన సొత్తు చోరీ
ఆ ఇంటివాళ్ళు సరదాగా రెండు రోజులు టూర్ కు వెళ్లారు. టూర్ పూర్తయింది. ఇంటికి తిరిగొచ్చారు.
- By Hashtag U Published Date - 09:36 PM, Wed - 25 May 22

ఆ ఇంటివాళ్ళు సరదాగా రెండు రోజులు టూర్ కు వెళ్లారు. టూర్ పూర్తయింది. ఇంటికి తిరిగొచ్చారు. తలుపుకు వేసి వెళ్లిన లాక్ ను తీసి ఇంట్లోకి రాగానే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే.. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో పెట్టి వెళ్లిన డబ్బు, బంగారం మాయం అయ్యాయి.
దీంతో దొంగతనం జరిగి ఉంటుందనే నిర్ధారణకు ఆ ఇంటివాళ్ళు వచ్చారు. ఈ ఘటన గోవాలోని మార్ గోవా పట్టణంలో చోటుచేసుకుంది. ఆ కుటుంబీకులు దొంగతనం గురించి బాధపడుతూ వెళ్లి టీవీ ముందు నిలబడగా .. స్క్రీన్ పై మార్కర్ తో రాసిన ఒక మెసేజ్ కనిపించింది. “ఐ లవ్ యూ” అని అందులో రాసి ఉంది. దొంగతనం అయిపోయాక.. వెళ్ళేటప్పుడు దొంగలు ఈ మెసేజ్ ను రాసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.రూ.1.50 లక్షల నగదు, దాదాపు రూ.20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను దొంగలు కొల్లగొట్టారు. దీనిపై బాధిత కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.