Sankranti 2025 : వేల కోట్ల పందేలు..హైలైట్ పందెం అదే
Sankranti 2025 : ముఖ్యంగా ఏపీలో కోడి పందేల (Cockfighting) కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాలు మినీ స్టేడియాల్లా కనిపించాయి
- By Sudheer Published Date - 10:02 AM, Thu - 16 January 25

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti 2025) వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పూజలు, భోగి మంటలు వంటి సంప్రదాయాలతో పాటు కోడి పందేలు, గుండాటలు వంటి వేడుకలు హీటెక్కించాయి. ముఖ్యంగా ఏపీలో కోడి పందేల (Cockfighting) కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాలు మినీ స్టేడియాల్లా కనిపించాయి. టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, కామెంట్రీలు, గ్యాలరీలతో ప్రతీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. మూడు రోజుల్లో మొత్తం రూ.2 వేల కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం.
భోగి పండుగ నాడు రూ.350 కోట్ల పందేలు జరగ్గా, సంక్రాంతి రోజున ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయి రూ.600 కోట్లకు చేరుకుంది. కనుమ పండుగ రోజు మాత్రం పందెం రాయుళ్లు తమ ప్రతిభను మరింతగా ప్రదర్శిస్తూ ఒక్కరోజే వెయ్యి కోట్ల పందేలు నిర్వహించినట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రాంతంలో జరిగిన ఓ కోడి పందేకు రూ.1.25 కోట్లు పలికిందని చెబుతున్నారు. ఈ పందెం సంక్రాంతి పండుగలో హైలైట్‌గా నిలిచింది.
AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలతో పాటు గుండాటలు కూడా జోరుగా నిర్వహించారు. కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో రూ.500 కోట్లకు పైగా పందేలు జరిగాయి. గుండాట వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున లాభాలను చవిచూశాయి. ఒక్కొక్క గ్రామంలో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 1500కు పైగా బరులు ఏర్పాటు చేసి భారీ మొత్తంలో పందేలు నిర్వహించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కోడి పందేలు, పేకాట, గుండాటలు విస్తృతంగా జరిగాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు పందేలు హోరెత్తించాయి. గుంటూరు జిల్లాలో ఒక్కో పందెం లక్షల్లో జరగగా, వీఐపీ పందేలలో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పందేలు సాగాయి. పందేల్లో విజేతలు బుల్లెట్ బైకులు, స్కూటీలు, థార్ జీపులు వంటి బహుమతులను గెలుచుకున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా ఖండవల్లిలో గుండాటలో డబ్బులు పొందలేకపోవడంతో ఒక యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఓవరాల్ గా గత ఏడాది కంటే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.