Telangana University Issue:తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఓవర్ యాక్షన్, ఫిర్యాదు చేసిన విద్యార్థులపైనే చర్యలకు కమిటీ..!!
నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులకు దారి తీస్తోంది.
- Author : hashtagu
Date : 14-09-2022 - 1:14 IST
Published By : Hashtagu Telugu Desk
నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులకు దారి తీస్తోంది. ఇప్పటికే గణేష్ నిమజ్జనం సందర్భంగా గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినులతో ఔటర్స్ తో కలిసి ఆయన నృత్యాలు చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా, వర్సిటీ అధికారులు మాత్రం వీసీపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపైనే చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశారు. ఈ మేరకు టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. విద్యావర్థిని మాట్లాడుతూ వీసీపై అసభ్య పదజాలం వాడిన విద్యార్థి సంఘం నేతలను మందలించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశాం… ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని ఆమె అన్నారు. కాగా తనకు ప్రభుత్వ పెద్దల సహకారం ఉందని తనను ఎవరేం చేయలేరని వీసీ బెదిరిస్తున్నాడని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీని తామే రాత్రిపూట ఆహ్వానించామని చెప్పాలంటూ రిజిస్ట్రార్ విద్యావర్ధిని తమను ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వీసీ డబ్బులు వెదజల్లుతూ డాన్స్ చేసిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాన్ని హ్యాష్ టాగ్ యూ వెబ్ సైట్ విస్తృతంగా కవర్ చేయగా, పలు వర్గాల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ వివాదంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించారు. ప్రభుత్వం తక్షణమే వీసీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం వీసీ వ్యవహార శైలిపై ఉద్యమిస్తున్నారు.