Telangana Police: తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ
- Author : Balu J
Date : 16-11-2022 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్‌స్టేషన్ లను మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డీజీపీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.
కాగజ్ నగర్ పర్యటనలో భాగంగా కోటి రూపాయాల వ్యయంతో నిర్మించిన కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్, రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఇన్స్పెకర్ట్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ట్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాంకిడి పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), కౌటాల పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), పెంచికల్ పేట్ పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు), చింతలవానిపల్లి పోలీస్ స్టేషన్ (రూ. 2. 50 కోట్లు) ల శిలఫకాలను ఆవిష్కరించి, వర్చువల్ ద్వారా నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు.
అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం కోటి రూపాయాల వ్యయంతో నిర్మించిన రెబ్బన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని మంత్రులు వివరించారు.