Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత..!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణించారు.
- By HashtagU Desk Published Date - 09:51 AM, Mon - 28 February 22

ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎప్పటి నుంచో ఆయన టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లాలో జన్మించిన యడ్లపాటి వెంకట్రావు, 1967,1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
ఇక ఆ తర్వాత 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే వేమూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, ప్రణాళికా-న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం ఆయన 1995లో జడ్పీ చైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు గారి మరణం విచారకరం. పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం ఆశయాల సాధన కోసం కృషి చేశారాయన. వయోభారంతో కొంతకాలం నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు తన అభిప్రాయాలను, సలహాలను అందించేవారు(1/2) pic.twitter.com/gxehIFay8G
— Lokesh Nara (@naralokesh) February 28, 2022