Taj Mahal: ఉగ్రరూపం దాల్చిన యమునా నది.. ఏకంగా తాజ్ మహల్ గోడలను తాకిందిగా?
భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలలో కుండపోత వర్షాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చింది. వరద తగ్గిందని అందరూ భావించినప్పటికీ అంతకంతకు వ
- By Anshu Published Date - 04:19 PM, Tue - 18 July 23

భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలలో కుండపోత వర్షాల కారణంగా యమునా నది ఉగ్రరూపం దాల్చింది. వరద తగ్గిందని అందరూ భావించినప్పటికీ అంతకంతకు వరదపెరుగుతోంది. యమునా నాది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. హర్యానాలో మళ్లీ భారీ వర్షాలు పడుతుండడంతో యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి పెరుగుతోంది. మరోవైపు ఢిల్లీలో వరద బీభత్సం కొనసాగుతుండగానే గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారిగా ఆగ్రాలోని తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి.
ఇతిమద్-ఉద్-దౌలా టాంబ్ బయటి ప్రదేశంలోకి కూడా నీరు ప్రవేశించింది. రామ్‌బాగ్, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ బాగ్, మెహ్‌తాబ్ బాగ్ లాంటి స్మారక కట్టడాలకు ముంపు పొంచి ఉంది. పియోఘాట్‌లో మోక్షధామ్, తాజ్‌గంజ్ స్మశాన వాటికలను వరద నీరు ముంచెత్తడంతో మరణించిన ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. అలాగే వరదలను నివారించడానికి సికంద్రాలోని కైలాష్ ఆలయం నుంచి తాజ్ మహల్ సమీపంలోని దసరా ఘాట్ వరకు నద ఘాట్ లపై బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.
నదిలో నీటి మట్టం మరింత పెరిగిన పక్షంలో తాజ్‌మహల్ ఎదురుగా ఉన్న కైలాష్ ఘాట్‌తో పాటుగా ఆ చుట్టపక్కల ఉన్న మరో 27 స్మారక కట్టడాలకు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వరదల సమయంలో కూడా వరద నీరు తాజ్ మహల్ లోనికి ప్రవేశించకుండా దీని నిర్మాణం జరిగినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.