Shubman Gill: శతకాలతో చెలరేగుతున్న గిల్.. ఐపీఎల్ లోనూ సూపర్ ఫామ్
2022 సీజన్లో మాత్రమే కాదు..ప్రస్తుత 2023 సీజన్లో సైతం శతకాలతో చెలరేగిపోతున్నాడు.
- Author : Balu J
Date : 16-05-2023 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
భారత యువఓపెనర్ శుభ్ మన్ (Shubman Gill) గిల్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. 2022 సీజన్లో మాత్రమే కాదు..ప్రస్తుత 2023 సీజన్లో సైతం శతకాలతో చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన శుభ్ మన్ గిల్.. ఐపీఎల్ లో సైతం తన తొలి సెంచరీని సాధించగలిగాడు. ఐపీఎల్ లో చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గా గత సీజన్ నుంచి ఆడుతున్న శుభ్ మన్ గిల్ ప్రస్తుత సీజన్లో తన తొలిశతకం సాధించగలిగాడు.
హోంగ్రౌండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో గిల్ సెంచరీ హీరోగా నిలిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు గిల్ తన బ్యాటింగ్ జోరును కొనసాగించి కేవలం 58 బంతుల్లో 13 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 101 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఆట 19వ ఓవర్లో సీమర్ నటరాజన్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా తొలి ఐపీఎల్ శతకాన్ని తన ఖాతాలో వేసుకోగలిగాడు. ఇప్పటికే క్రికెట్ మూడు ( టెస్టు, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలో అంతర్జాతీయ సెంచరీలు సాధించిన గిల్.. ఎట్టకేలకు ఐపీఎల్ లో సైతం శతకం నమోదు చేయగలిగాడు.
గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్‌పై 95 పరుగుల స్కోరుకు అవుటైన గిల్.. సన్ రైజర్స్ పై మాత్రం శతకం పూర్తి చేయగలిగాడు. తన తొలి అర్థశతకాన్ని 22 బంతుల్లోనే పూర్తి చేసిన గిల్..రెండో అర్థశతకాన్ని 34 బంతుల్లో కానీ సాధించలేకపోయాడు. వన్ డౌన్ సాయి సుదర్శన్ తో కలసి రెండో వికెట్ కు 147 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో సెంచరీమార్క్ చేరిన ఆరవ బ్యాటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. ప్రస్తుత సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు.