IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్
ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు శుభ్‌మాన్ గిల్. కనికరమే లేకుండా బౌలర్లను ఉతికారేశాడు.
- By Praveen Aluthuru Published Date - 09:45 PM, Fri - 26 May 23

IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ (IPL 2023 Qualifier 2) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు శుభ్‌మాన్ గిల్ (Shubman Gill). కనికరమే లేకుండా బౌలర్లను ఉతికారేశాడు. ఈ రోజు గిల్ తుఫాను బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో శభాష్ అనిపించుకున్నాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ సీజన్‌లో శుభ్‌మాన్ గిల్ కి ఇది మూడో సెంచరీ.
శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతూ ముంబై బౌలర్లను చిత్తు చేశాడు. గిల్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో ఫోర్ల కంటే సిక్సర్లతో రఫ్ఫాడించాడు. ఈ రోజు ముంబై, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా గిల్ ఉచకోతతో అహ్మదాబాద్‌లో అభిమానులను కేరింతలు పెట్టించాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫిఫ్టీ కంప్లీట్ అవ్వడమే లేటు గిల్ ఊచకోత మొదలైంది. ముంబై ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ ఓవర్‌లో వరుస సిక్సర్లు బాది చెలరేగిపోయాడు.

Shubman Gill hits 3rd hundred In 2023 IPL
గిల్ ఇక్కడితో ఆగలేదు పీయూష్ చావ్లా వేసిన తర్వాతి ఓవర్‌లో ఒక ఫోర్ మరియు రెండు సిక్సర్లు కొట్టి ఆ ఓవర్ నుండి 20 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న శుభ్‌మాన్ 49 బంతుల్లో ఐపీఎల్ 2023 లో తన మూడో సెంచరీని సాధించాడు. ఈ సీజన్‌లో శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌తో విధ్వంసం సృష్టించాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఒక సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ మాత్రమే ఈ ఘనత సాధించారు. శుభ్‌మాన్ గిల్ తన తుఫాను ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డుప్లెసీని అధిగమించాడు, దీంతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 800 పరుగుల మార్క్‌ను సునాయాసంగా అధిగమించాడు.
Read More: IPL 2023 Final Tickets: క్వాలిఫైయర్-2 టికెట్ రేట్ కాస్ట్ లీ గురూ