Charles Shobharaj : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల..!
కరడుగట్టిన హంతకుడు, ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78) ను జైలు నుంచి విడుదల కానున్నాడు.
- By Maheswara Rao Nadella Published Date - 02:22 PM, Thu - 22 December 22

కరడుగట్టిన హంతకుడు, ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78) ను (Charles Shobharaj) జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతడిని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. చార్లెస్‌కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులేమీ లేకపోతే బుధవారమే (ఈ రోజే) విడుదల చేసి 15 రోజుల్లోపు అతడిని స్వదేశానికి పంపేయాలని నేపాల్ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను చంపిన కేసులో శోభరాజ్‌ను 2003లో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో నేపాల్ సుప్రీంకోర్టు అతడికి 21ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటినుంచి అతడు నేపాల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, సుమారు 20ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం వంటి కారణాలతో అతడి విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. అంతకుముందు ఢిల్లీలోని హోటల్‌లో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయిన చార్లెస్ 1997వరకు భారత్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవించాడు.
చార్లెస్ శోభరాజ్ (Charles Shobharaj) భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే వారు విడిపోయారు. దీంతో తన తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టడంతో శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేయడంతో అతడు నేరాల బాటపట్టాడు. 1970లలో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. ఆపై 20 హత్య కేసుల్లో చిక్కుకున్న శోభరాజ్.. ఢిల్లీలోని ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో 1976లో అరెస్టయి భారత్‌లోని వివిధ జైళ్లలో 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు.
Also Read: In Phoenix : 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్. ఈ కొత్త ఫోన్ ఎంతంటే!