Climate Crisis: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. కరుగుతున్న మంచు ఫలకాలు.. అంతరిస్తున్న పగడపు దీవులు!!
భూమిపై ఎక్కువగా ఏదైనా ఉందంటే.. అది నీరే!! మహా సముద్రాలు, సముద్రాల్లో నీరే ఉంది.
- By Hashtag U Published Date - 08:30 AM, Sat - 10 September 22

భూమిపై ఎక్కువగా ఏదైనా ఉందంటే.. అది నీరే!! మహా సముద్రాలు, సముద్రాల్లో నీరే ఉంది. ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు కరిగినా మారేది నీటిగానే!!కాబట్టి భవిష్యత్ లో భూమికి ఏదైనా మహా విపత్తు వస్తే అది జలగండం రూపంలోనే అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు ప్రస్తుతం మానవాళి ముంగిట మోగుతున్న ప్రమాద ఘంటికలను గుర్తు చేస్తున్నాయి. ఈ తరహాలో భూమికి విపత్తును జలగండాన్ని సృష్టించగల అత్యంత సున్నితమైన ప్రదేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సెన్సిటివ్ ప్రదేశాల సంఖ్య 16కు పెరిగిందని గుర్తు చేస్తున్నాయి. వీటిలో దాదాపు ఐదు నుంచి ఆరు సెన్సిటివ్ ప్రదేశాలు మనం అంచనా వేస్తున్న సమయం కంటే ముందే.. ముప్పును కొని తెచ్చేలా ఉగ్రరూపం దాల్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఎన్నో విపత్తులు.. ఒకే కారణం
ఇటీవల పాకిస్థాన్ ను కుదిపేసిన వరదలు, అమెరికా, ఆస్ట్రేలియాలలో కార్చిచ్చు, చైనాలో కరువు కేకలు , ఇతర దేశాల్లో ఇతరత్రా రూపాల్లో ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. పర్యావరణ కాలుష్యం వల్ల ఆయా సెన్సిటివ్ ప్రదేశాలలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. హిమానీ నదాలు కరిగి నదులు ఉప్పొంగాయి. ఫలితంగా వరదలు చోటుచేసుకున్నాయి.ఉష్ణోగ్రతలు పెరిగి సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి. ఫలితంగా సముద్ర పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగి అడవుల్లో కార్చిచ్చు రాచుకుంటోంది. వాతావరణం సరిగ్గా లేక.. రుతుపవనాలు సకాలంలో రాక.. వర్షాలు కురవక కరువు విలయతాండవం చేస్తోంది.
ఆర్కిటిక్ లో నాలుగు రెట్లు ఎక్కువగా..
ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణంలో వస్తున్న మార్పులతో మంచు భారీగా కరిగిపోతోంది. భూమి మొత్తంతో పోలిస్తే ఆర్కిటిక్ వద్ద 3 నుంచి 4 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలానే కొనసాగితే పెనుముప్పు తప్పదని అంటున్నారు. ఆర్కిటిక్ మంచు కరిగిన నీరు చేరడంతో సముద్రాల్లో నీటి మట్టం కూడా పెరుగుతోంది. గ్రీన్ లాండ్ లోని భారీ మంచు ఫలకాలు కరిగిపోతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో మంచు కరిగి వచ్చిన నీరు యునైటెడ్ స్టేట్స్ మొత్తాన్ని అర మీటరు ఎత్తు వరకు ముంచేయగలదని డానిష్ పరిశోధకులు తెలిపారు.
గ్రీన్ ల్యాండ్‌లో..
2002 నుంచి ఇప్పటి వరకు గ్రీన్ ల్యాండ్‌లో 4,700 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయింది. 4700 క్యూబిక్ కిలోమీటర్ల మేర కరిగిన నీరు అమెరికాను అర మీటర్ మేర ముంచేయగలదని చెబుతున్నారు. హిమపాతం కరగడం వల్ల సముద్రాల్లో 1.2 సెం.మీ. వాటర్ లెవల్ పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. గ్లేసియర్ ముందు భాగాల్లో మంచు పడిపోతోందని, గ్రీన్ లాండ్ పశ్చిమ తీరంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల బృందం వివరించింది. గ్రీన్ లాండ్స్ లోని మంచు ఫలకాలు మొత్తం కరిగితే సముద్రాల్లో నీటి మట్టాన్ని 7 మీటర్లు పెంచగలవని, అంటార్కిటిక్ రీజియన్‌లోని మంచు కరిగితే 50 మీటర్ల మేర సముద్రాల నీటి మట్టాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
పశ్చిమ అంటార్కిటికాలో..
ముఖ్యంగా పశ్చిమ అంటార్కిటికాలో మంచుఫలకాలు తిరిగి ఎప్పటికీ కోలుకోలేనంత స్థాయిలో కరిగిపోతున్నాయి!అంటార్కిటికా పశ్చిమప్రాంతంలో ఆరు ముఖ్యమైన హిమానీనదాలు(గ్లేసియర్లు) ఉన్నాయి. వీటిలో పైన్ ఐల్యాండ్ గ్లేసియర్ ఒకటి. దీని నుంచి మంచుముక్కలు కొన్నేళ్లుగా గుట్టగుట్టలుగా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ గ్లేసియర్ నుంచి ఏకంగా 1,640 అడుగుల మందం, 12 మైళ్ల పొడవు, 20 మైళ్ల వెడల్పున్న ‘ఐస్ ఐల్యాండ్ బీ31’ అనే ఓ మంచు కొండే విడిపోయిందని.. అది క్రమంగా సముద్రం వైపుగా కదులుతోందని గతేడాది నాసా వెల్లడించింది. ధ్రువాల వద్ద మంచు ఫలకాలలో పగుళ్లు సాధారణమే అయినా.. ఇంత పెద్ద మంచు కొండలు విడిపోవడం అనేది అసాధారణమని నిపుణులు అంటున్నారు. ఉత్తరార్ధగోళంలోని గ్రీన్‌ల్యాండ్ కూడా కరుగుతోన్నా.. పశ్చిమ అంటార్కిటికా మాత్రమే చాలా వేగంగా కరుగుతోం దంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా 2005-10 మధ్యలో సముద్ర మట్టాలు పెరగడానికి పశ్చిమ అంటార్కిటికాలో ఉన్న ఆరు గ్లేసియర్లు కరగడమే 10 శాతం కారణమయ్యాయట. ఈ గ్లేసియర్లు ఇలాగే కరిగిపోతే గనక.. సముద్ర మట్టాలు వందేళ్లలోనే ఏకంగా 4 అడుగుల మేరకు పెరుగుతాయని అంచనా.
గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గిస్తేనే..
గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గిస్తే గనక భూతాపోన్నతి తగ్గి భవిష్యత్తులో మంచు కరిగే వేగం తగ్గవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే సీవోటూ, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల నియంత్రణకు ఇకనైనా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం చూడాలని చెబుతున్నారు.
పగడపు దీవులకు ముప్పు..
సముద్రపు అడుగుభాగంలో కొంత భాగాన్నే ఆక్రమించిన పగడపు దీవుల వల్ల బిలియన్‌కు పైగా ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వీటికి ముప్పు ఏర్పడిందని, 2009 తర్వాతి నుంచి ఇప్పటివరకు పగడపు దిబ్బల్లో 14% కోల్పోయినట్లు ఓ అధ్యయన నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మానవులు గ్రీన్‌హౌజ్ వాయువులను నియంత్రించగలిగితే కొన్ని పగడపు దిబ్బలనైనా రక్షించవచ్చని నివేదిక సూచించింది.ఆమ్లీకరణ, వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతలు, ఓవర్ ఫిషింగ్, కాలుష్యం, టూరిజం, పేలవమైన తీరప్రాంత నిర్వహణ’ వంటి కారణాలతో పగడపు పర్యావరణ వ్యవస్థకు ముప్పు కలుగుతోందని
తెలిపింది.దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, తూర్పు ఆసియా, పశ్చిమ హిందూ మహాసముద్రం, ఒమన్ గల్ఫ్‌లోని పగడపు దీవుల్లోనే ఎక్కువ పగడపు దీవులు దెబ్బతిన్నాయి. 2010 నుంచి ప్రపంచంలోని పగడపు దిబ్బలపై ఆల్గే మొత్తం సుమారు 20 శాతం పెరిగిందని, దీనికి ముందు ఆల్గే కంటే పగడాలు రెండు రెట్లు ఎక్కువగా ఉండేవి. ఈ మార్పు సముద్ర ఆవాసాలను ప్రభావితం చేస్తుండటంతో పాటు తక్కువ జీవవైవిధ్యానికి కారణమవుతుంది. అంతేకాదు పర్యావరణ వ్యవస్థను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా ప్రపంచానికి కీలక వనరుగా ఉన్న పగడపు దీవులు ముప్పును ఎదుర్కొవడంతో నష్టనివారణ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచదేశాలు కలిసి పనిచేయకపోతే శతాబ్దం చివరినాటికి పగడపు దీవులన్నీ బ్లీచింగ్ అవుతాయని యునైటెడ్ నేషన్స్ ఎన్వరాన్మెంట్ ప్రగ్రామ్ (UNEP) తెలిపింది.
Related News

Glacier : బద్దలైన 10 ఫుట్‌బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్. వీడియోలో రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు.
అంతార్కిటికలో 10 ఫుట్ బాల్ ల వైశాల్యం ఉన్న గ్లేషియర్ బద్దలైపోయింది. అంటర్క్‌టికా పెనిన్సులాలో పరిశోధనలు నిర్వహిస్తున్న ఆర్ ఆర్ ఎస్ జేంస్ క్లార్క్ బృందం కళ్ళెదుటే గ్లేషియర్ బద్దలైంది. ఈ దృశ్యాలను టీం తమ కెమెరాలో బంధించారు. సముద్ర గర్భంలో అతిపెద్ద సునామీని సృష్టించగల శక్తి ఉన్న ఈ ఘటన .. అత్యంత తీవ్రత గల తరంగాలను సృష్టించి ఉండొచ్చని అంచన్నా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. జ