Satya Pal Malik: నేను అరెస్ట్ కాలేదు: మాజీ గవర్నర్
అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నుండి సమన్లు అందుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
- Author : Praveen Aluthuru
Date : 22-04-2023 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
Satya Pal Malik: అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నుండి సమన్లు అందుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్‌కె పురం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అయితే తనని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. తన ఇష్టపూర్వకంగా పోలీసు స్టేషన్‌కు వచ్చానని ఒక ప్రకటన విడుదల చేశారు. మాలిక్‌ను అరెస్టు చేసినట్లు పలువురు బీకేయూ నేతలు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.
ఈ వివాదంపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మాజీ గవర్నర్ సత్యపాల్ ని మేము అదుపులోకి తీసుకోలేదు. ఆయన ఇష్టానుసారంగానే తన అనుచరులతో వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో సత్యపాల్ మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు
అంతకు ముందుజమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్‌కు మద్దతుగా నిర్వహించిన ఖాప్ సభ రద్దు అయింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ నుంచి పలువురు నాయకులు , రైతులు వచ్చారు. వారికోసం ఆర్కే పురంలోని ఓ పార్కులో టెంట్ వేసి వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుండగా ఢిల్లీ పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని ఆపాలని కోరారు.
ఇకపోతే బీమా కుంభకోణం కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన బీమా కుంభకోణం కేసులో సీబీఐ తమ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించడం ఏడు నెలల్లో ఇది రెండోసారి. సిబిఐ విచారణ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను రైతు కుమారుడిని, ఎలాంటి విచారణకు అయినా సిద్దమే. నేను భయపడను. నేను సత్యం వైపు నిలబడతాను అంటూ వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సత్యపాల్ మాలిక్‌కు సంఘీభావం తెలుపుతూ దేశం మొత్తం మీ వెంటే ఉంది అని ట్వీట్ చేశారు. మీరు ముందుకు వెళ్లండి సార్ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Read More: Baahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాహుబలి మళ్లీ వచ్చేస్తున్నాడు, అప్డేట్ ఇదిగో!