Russia Ukraine War: ఏ క్షణంలోనైనా రష్యా చేతికి కీవ్..!
- By HashtagU Desk Published Date - 03:24 PM, Tue - 1 March 22

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. అక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న రష్యా తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సైనిక బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్‌కు సమీపంగా రష్యా సైన్యం చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 65 కిలోమీటర్లు పొడవు ఉన్న రష్యా సైనికుల కాన్వాయ్ కీవ్‌కు సమీపానికి చేరుకుందని సమాచారం.
ఇక ఒకవైపు చర్చలంటూనే మరోవైపు రష్యా కీవ్, ఖర్కీవ్ నగరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది. ఖర్కీవ్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పై రష్యా క్షిపణులతో దాడి చేయడంతో భవనం ధ్వంసమయింది. రాజధాని కీవ్‌తో పాటు మిగిలిన నగరాలు టెర్రోపిల్, రివ్నేలను కూడా కైవసం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకూ ఎదురొడ్డి నిలిచిన ఉక్రెయిన్ సేనలు ప్రధాన నగరాల్లో రష్యా సైనికులు ప్రవేశించకుండా అడ్డుకోగలిగాయి. కానీ పెద్దయెత్తున రష్యాబలగాలు తరలి వస్తుండటంతో వారిని ఎదుర్కొనడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. మొత్తం మీద రాజధాని కీవ్‌ను ఏ క్షణంలోనైనా రష్యా ఆక్రమించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.