RTC Bus Fell : పాడేరు ఘాట్ రోడ్డు వద్ద లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి
ఆదివారం సాయంత్రం పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తోంది
- Author : Sudheer
Date : 20-08-2023 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (APSRTC bus).. పాడేరు ఘాట్‌రోడ్డు (Paderu Ghat Road) వ్యూపాయింట్ మలుపు వద్ద చెట్టు కొమ్మను తప్పించబోయి 100 అడుగు లోయ పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 30 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఆదివారం సాయంత్రం పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (BUS) విశాఖపట్నం నుంచి పాడేరు (Paderu ) వెళ్తోంది. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. లోయలో బస్సు పడడం తో గాయపడిన వారిని కాపాడేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. స్థానికుల సహాయంతో గాయపడ్డ వారు రోడ్డు మీదకి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మరో ఆర్టీసీ బస్సులో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం ప్రయాణికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. లోయలోని చెట్ల కొమ్మలు అడ్డుపడటంతో బస్సు మధ్యలోనే చిక్కుకుందని, లేకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా బస్సు లోయలో పడి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని అంటున్నారు.
ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.