Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రబ్చా మరియు లాల్ మద్ది గ్రామం మధ్య ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
- By Praveen Aluthuru Published Date - 05:22 PM, Sun - 30 April 23

Rajasthan Road Accident: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రబ్చా మరియు లాల్ మద్ది గ్రామం మధ్య ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 3 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు.
అహ్మదాబాద్ నుండి చురు వెళ్తున్న ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 8పై లాల్ మద్ది కూడలి సమీపంలో పికప్ వ్యాన్‌ను రక్షించే ప్రయత్నంలో ప్రమాదానికి గురైందని స్థానిక పోలీసులు తెలిపారు. వ్యాన్ ను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పింది. దీంతో గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని నాథ్‌ద్వారాలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రయాణికులను అక్కడి నుంచి ఉదయ్‌పూర్‌కు తరలించారు. అదే సమయంలో ఆదివారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ ప్రమాదానికి కారణమైన పికప్ వ్యాన్ డ్రైవర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పికప్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామని, కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆనంద్ కుమార్ (34), రణవీర్ మేఘ్వాల్ (38), బాబులాల్ గోదారా (26) అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read More: YS Sharmila: అస్వస్థతకు గురైన వైఎస్ షర్మిల