Prashant kishore : క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు..!
నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ని పట్నాలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
- By Latha Suma Published Date - 03:42 PM, Tue - 7 January 25

Prashant kishore : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్, త్రోట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలు జరిగాయంటూ జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ని పట్నాలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవలే జరిగిన బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థులకు సంఘీభావంగా పట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 2న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు.
న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అయితే దాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించడంతో.. పోలీసులు బ్యూరో సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు.
Read Also: KTR : న్యాయవ్యవస్థపై మాకు పూర్తి గౌరవం ఉంది – కేటీఆర్