Power Bill Shock: తెలంగాణలో కరెంట్ ఛార్జీల షాక్!ఉద్యమం దిశగా విపక్షాలు
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపు వ్యవహారం వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
- Author : Hashtag U
Date : 22-02-2022 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపు వ్యవహారం వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఛార్జీలను పెంచకతప్పదని డిస్కంలు చెబుతున్నాయి. మరోవైపు అశాస్త్రీయ విధానాలు, నిర్వహణ లోపాల వల్లనే నష్టాలు వస్తున్నాయని, వాటిని సరిదిద్దుకోకుండా ప్రజలపై భారం వేయడం ఏమిటని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు పెంచితే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు ప్రారంభించింది.
డిస్కంలు సమర్పించిన ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆమోదించకూడదని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ)ని కోరాయి. రాజధాని హైదరాబాద్ సహా 16 జిల్లాల వ్యవహారాలను చూసే southern power distribution company limited (spdcl) ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే… అధికారుల లెక్కల ప్రకారం….ఆ సంస్థ నిర్వహణకు ఏటా రూ.18,183 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ రూ.10,732 కోట్లు మాత్రమే వస్తోంది. ప్రభుత్వం రూ.4,254 కోట్లు సబ్సిడీగా ఇస్తోంది. అయినా ఇంకా రూ.1,410 కోట్ల నష్టం మిగులుతోంది. దీన్ని భర్తీ చేయడానికే స్వల్పంగా ఛార్జీలు పెంచుతామని డిస్కం ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నష్టాలకు నిర్వహణలో ఉన్న లోపాలే కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ భారాన్ని ప్రజలపై వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెరుగైన సేవలు అందించాంటే మొదట నష్టాల నుంచి బయటపడాలని, అందుకు ఛార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో అసలే రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రతిపక్షాలకు కోరి అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న వాదనా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.