Pakistan Crisis: ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్.. దివాలా తప్పాలంటే ఆ పనిచేయాల్సిందేనన్న పాక్ మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్
పాకిస్థాన్ దివాలా ముప్పును తప్పించుకోవాలంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆ దేశ కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్ రెజా బకీర్ అన్నారు.
- Author : News Desk
Date : 18-06-2023 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. గత ఏడాది కాలంగా ఆ దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్ యూఎస్‌డి 1.2 బిలియన్లను పొందుతుందని ఆశించింది. అయితే ఏజెన్సీ ప్రకారం పాకిస్థాన్ కు అందాల్సిన నిధులు ఇంకా అందలేదు. తొమ్మిదో సమీక్షా సమావేశం గత ఏడాది అక్టోబర్ నుంచి జరుగుతోంది. ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పాకిస్థాన్‌కు దివాలా ముప్పు పొంచిఉంది. ఈ సందర్భంగా ఆదేశ కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్ రెజా బకీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాకిస్థాన్ నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. దివాలా ముప్పును తప్పించుకోవాలంటే సంబంధాలను మెరుగుపర్చుకోక తప్పదని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్ దివాలా తీస్తే గనుక పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయని రెజా బకీర్ హెచ్చరించారు. దివాలా ముప్పును తప్పించుకోవాలంటే ఆయా సంస్థలతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాల్సిందేనని ఆయన పాకిస్థాన్ ప్రభుత్వానికి హితవు పలికారు. పాకిస్థాన్ సంబంధాలను మెరుగుపర్చుకుంటేనే కావాల్సిన సాయం అందుతుందని ఆయన చెప్పారు.
ఐఎంఎఫ్ నుంచి అందించిన 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పునరుద్దరణకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినట్లు కనిపిస్తున్నాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. జూన్ 30వ తేదీతో గడువు ముగుస్తుంది. 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీలో ఇంకా 2.6 బిలియన్ డాలర్లు విడుదల కావాల్సి ఉంది. కానీ, ఐఎంఎఫ్ పెట్టిన కొన్ని షరతులను పాకిస్థాన్ ఇంకా అమలు చేయడం లేదు. ఇప్పటి వరకు పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు.
G20 Tourism Meet : జీ-20 టూరిజం సమావేశాలకు సిద్ధమైన గోవా.. ప్రధాన చర్చ ఆ సమస్యలపైనే ..