Pak Violates Ceasefire: బోర్డర్‌లో మరోసారి టెన్షన్.. పాక్- భారత్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పీఎం మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
- By Gopichand Published Date - 07:42 AM, Tue - 29 April 25

Pak Violates Ceasefire: పాకిస్తాన్ సైన్యం వరుసగా ఐదవ రోజు జమ్మూ-కాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద కాల్పులు (Pak Violates Ceasefire) జరిపింది. దీనికి భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ఏప్రిల్ 28- 29 రాత్రి పాకిస్తాన్ సైన్యం కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అఖ్నూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపిందని తెలిపారు. మా సైనికులు కూడా కాల్పులకు సమర్థవంతంగా సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు.
పాకిస్తాన్ సైన్యం పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో నిరంతరం కాల్పులు జరుపుతోందని తెలుస్తోంది. సైన్యం దీనికి గట్టిగా సమాధానం ఇచ్చింది. గత 5 రోజులుగా జరుగుతున్న కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు లేదా మరణించినట్లు సమాచారం లేదు. ప్రస్తుతం సైనికులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పీఎం మోదీ ఇలా అన్నారు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పీఎం మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద ఘటన దేశంలోని ప్రతి పౌరుడినీ బాధపెట్టిందని పీఎం అన్నారు. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడి మనసులో సానుభూతి ఉందన్నారు.
పీఎం మరింత మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు అతను ఏ మతానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడినా, ఈ దాడి బాధను అనుభవిస్తున్నాడని అన్నారు. ఈ రోజు ప్రతి భారతీయుడి రక్తం ఉగ్రదాడి దృశ్యాలను చూసి మరిగిపోతోందని అన్నారు. ఈ దాడి తర్వాత నుంచి భారత సైన్యం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇప్పటివరకు భారత సైన్యం జమ్మూ-కాశ్మీర్‌లో 10 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసింది. ఇక పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లడానికి ఈ రోజు చివరి రోజు. పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వం 48 గంటల్లో అందరూ పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేసింది.