New Delhi Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో మరణించిన 18 మంది వీరేనా!
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ప్రమాదం జరిగింది. రైలు మహాకుంభానికి వెళ్లేందుకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 13, 14, 15పై ప్రజలు వేచి ఉన్నారు.
- By Gopichand Published Date - 12:27 PM, Sun - 16 February 25
New Delhi Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. లోక్ నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్ (LNJP) లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి యంత్రాంగం 17 మంది మరణించినట్లు (New Delhi Stampede) నిర్ధారించింది. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ఆయన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం కూడా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందజేస్తామన్నారు. ప్రమాదంలో మరణించిన వారి గురించి చెప్పాలంటే.. తొక్కిసలాటలో నలిగి 14 మంది మహిళలు మరణించారు. ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు.
ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పేర్లు
మీడియా కథనాల ప్రకారం.. మరణించిన వారిలో బక్సర్‌కు చెందిన ఆశాదేవి (79), సరన్‌కు చెందిన పూనమ్ దేవి (35), పాట్నాకు చెందిన లలితా దేవి (35), ముజఫర్‌పూర్‌కు చెందిన సురుచి (11) ఉన్నారు. సమస్తీపూర్‌కు చెందిన కృష్ణదేవి (40), సమస్తీపూర్‌కు చెందిన విజయ్ సాహ్ (15), నవాడకు చెందిన నీరజ్‌కుమార్ రాయ్ (12), శాంతి దేవి (40), నవాడకు చెందిన పూజా కుమారి (8) ఉన్నారు. మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు.
Also Read: Bird Flu : బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. మటన్‌కు భారీగా పెరిగిన డిమాండ్
3 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య తొక్కిసలాట
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ప్రమాదం జరిగింది. రైలు మహాకుంభానికి వెళ్లేందుకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 13, 14, 15పై ప్రజలు వేచి ఉన్నారు. రైలు రాగానే వారి మధ్య తోపులాట జరిగింది. ఇది తొక్కిసలాటకు దారితీసింది. రాత్రి 9.26 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచే రైల్వే స్టేషన్‌కు జనం గుమిగూడారు. రాత్రి 8.30 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు మూడు రైళ్లు రావాల్సి ఉండగా ఆలస్యంగా వచ్చాయి. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ఘటనపై ఎల్జీ నుంచి ప్రధాని వరకు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిపాలన, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నలు సంధించారు. మృతులు, క్షతగాత్రుల సరైన సంఖ్యను విడుదల చేయాలని రెండు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.