Nairobi Flies: ‘పశ్చిమ బెంగాల్’ లోని ప్రజలను వణికిస్తున్న నైరోబి ఈగలు.?
- By Anshu Published Date - 05:16 PM, Thu - 7 July 22

సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో అలాగే మన ఇళ్లలో ఈగలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏదైనా తినే పదార్థం పడింది అంతే అక్కడికి పెద్ద మొత్తంలో ఈగలు చేరుకుంటూ ఉంటాయి. కానీ ఇలా ఈగలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తే చాలా మంది అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఈగలు ఇంట్లోకి కానీ పరిసర ప్రాంతంలోకి రాకుండా ఉండాలి అని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ రావడం మాత్రం మారవు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఈగకు భయపడుతున్నారట.
అయితే ఈగలకు భయపడటం ఏంటి అని అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే, పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా నైరోబి ఈగ లేదంటే యాసిడ్ ఫ్లై ఈగలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ఈగలు నిత్యం వందలాది మంది ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. నారింజ ఎరుపు రంగులో ఉన్న ఈగలు మనుషులపై వాలితే విపరీతమైన నొప్పి ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. నొప్పితో పాటుగా జ్వరం వాంతులు అవ్వడం కూడా జరుగుతున్నట్లు తెలిపారు. ఆఫ్రికాకు చెందిన ఈగలను యాసిడ్ ఫ్లై లేదంటే నైరోబి ఈగ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఈగలు సిలిగురి, డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో విహారం చేస్తూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే వీటి పట్ల స్పందించిన వైద్య అధికారులు, అవి అంత ప్రమాదకరమైనవి కావని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వాటిలో మానవ శర్మానికి హాని కలిగించే పెడిటీన్ అనే ఒక ఆమ్లం ఉంటుందని తెలిపారు వైద్యులు. ఉత్తరాదిలో హిమాలయాల దిగువున వర్షపాతం అధిక౦గా ఉండటం వల్ల అవి అక్కడ తిరుగుతున్నాయని తెలిపారు. అయితే నిజానికి ఇవి ఎవరినీ కుట్టవని, కానీ అవి మన పై వాలినప్పుడు మనం చేతితో కొట్టే ప్రయత్నం చేస్తే అవి రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయని, తద్వారా మన చర్మంపై దద్దుర్లు రావడం, మంటగా అనిపించడం ఆ తర్వాత అది ఒక అంటువ్యాధిలా మారుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈగ వాలిన బాధితుల శరీరంపై విపరీతమైన మంట తీవ్రంగా నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తద్వారా జ్వరం బారినపడి వాంతులు విరోచనాలు కూడా అవుతున్నాయని తెలిపారు.